||రామాయణము||

||సీతా రామ కల్యాణం లో ...||

||"ఇయం సీతా మమసుతా..."!||


||ఓమ్ తత్ సత్||

సీతా రామ కల్యాణం లో ...
"ఇయం సీతా మమసుతా..."

బాలకాండలో సీతారామ కల్యాణము డెబ్బయ్ మూడవ సర్గలో వస్తుంది.
సీతా కల్యాణములో వేదమంత్రాలను గురించి ఏమీ వినము. జనకమహారాజు వశిష్ఠ మహామునిని లోకరాముడైన శ్రీరాముని వివాహక్రియ చేయమంటాడు. వశిష్ఠమహాముని వేదికను శాస్త్రోక్తముగా తయారు చేసి వైదీకహోమము చేసిన తరువాత జనక మహారాజు తన కుమార్తె సీతను కల్యాణ వేదిక దగ్గరకు తీసుకొని పోయి రఘువంశోత్తముడైన రాముని ముందర నిలబెట్టి ఈ విధముగా చెపుతాడు.

"ఇయం సీతా మమసుతా సహధర్మ చారిణీ తవ|
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||

అంటే,

"నాకూతురైన ఈ సీత నీకు సహధర్మ చారిణి అగును. నీకు మంగళము అగుగాక. ఆమె చేతిని నీ చేతిలో గ్రహించుము", అని అర్థము.

ఈ తాత్పర్యములో అసాధారణమైన సంగతి లేదు.
కాని ఈ శ్లోకములో ఇమిడి వున్న అర్థాలు చాలా వున్నాయి.
ఈ శ్లోకములో పిల్లని పెంచిన ప్రతి తల్లిదండ్రుల మమత , వారి ఆత్రుత కనిపిస్తాయి.

ఇక్కడ చెపుతున్నది జనక మహారాజు.
తాటక వధ అహల్యా శాపవిమోచనము ద్వారా రాముడు అవతారపురుషుడు అనే మాట విదితమే.
కాని జనకమహరాజు మనస్సులో మెదలుతున్నది నాగటిచాలులో దొరికిన తన కూతురే.
ఆ సీతపై అలోచనతో మొదలెడతాడు

"ఇయం సీతా" అంటూ.

"ఇయం సీతా" అనడములో చాలా అర్థాలు స్ఫురిస్తాయి.

"ఇయం సీత" అంటే
'నీకు ప్రత్యక్షముగా కనపడుచున్న రూపలావణ్యములలో వర్ణింప అలవికానిది, అయిన ఈ సీత,
"పుంసాం మోహనరూపాయ" అని వర్ణింపబడిన భువన మోహన రూపము కల నీకు తగినట్టిది," అని.
అంటే అమె నీకు అన్నివిధాల తగునట్టిది, సరితూగునట్టిది అని.
అలా అని ప్రత్యక్షముగా వున్న తన కూతురైన సీత ను గురించి రాముడికి జనకుడు చెప్పినట్లు ఒక అర్థము.

ఇంకో మాట.
"సీత" అంటే నాగటిచాలు.
నాగటి చాలులో దొరికిన పుత్రి అవడముచేత ఆమె సీత అనబడినది.
సీత అయోనిజ.
అంటే గర్భస్థములో పుట్టిన సాధారణ స్త్రీ కాదు.
ఆమె సాటిలేనిది.
"ఇయం సీతా" అనడములో ఈమె అయోనిజ, సాటిలేనిది, అని కూడా స్ఫురిస్తుంది.
అలాంటి సీతని నీ చేతిలో పెడుతున్నానుసుమా అని రాముని సంబోధిస్తూ చెప్పిన మాట అన్నమాట.

ఇంకో మాట.
సీత, (అంటే నాగటి చాలు), రైతు కృషి ఫలింపచేస్తుంది
అలాగే "ఇయం సీత" అంటే "ఈ సీత నీ కృషిని ఫలింపచేస్తుంది రామా" అని రాముని సంబోధించి చెప్పిన మాట అని ఇంకో స్ఫూర్తి.
ఇక్కడ తన కూతురు ఎవరికీ తీసిపోదు అనే ప్రతి తండ్రి భావము మనకి గట్టిగా వినిపిస్తుంది.

బాల కాండలో వాల్మీకి రామాయణము రాసి లవకుశులచేత "గ్రాహయత్", అంటే గ్రహింపచేస్తాడు అని వింటాము.

అప్పుడు వాల్మీకి రామాయణముగురించి చెపుతూ ఇది "సీతాయాః చరితం మహత్", రామాయణము సీత యొక్క మహత్తరమైన చరిత్ర అని కూడా అంటాడు. ఆ రామాయణము, మహత్తరమైన సీతా చరితము, లవకుశులు గానము చేస్తూ వుంటే , రాముడే తన సోదరులందరినీ "ఇది మహత్తరమైన కథ , నాకు కూడా శ్రేయస్కరమైనది - "శ్రూయతాం "వినండి" అని ఆహ్వానించడమైనది.
ఇప్పుడు "ఇయమ్ సీతా" అనడములో ఆ మహత్తరమైన చరిత్ర కల సీత ఈమేనయ్యా అని జనకుడు లోకాని కి చాటిస్తున్నాడా అని ఇంకో సూచన.

అలా "ఇయమ్ సీతా" అని చెప్పి "మమ సుతా" అని కూడా చెపుతాడు.
నా కూతురు అలాంటి దయ్యా అని రాముడి ని సంబోధించి చెప్పిన మాట,

అంతే కాదు ఈమె "సహ ధర్మచారీ తవ".
ఈమె ఎలావుంటుంది అనే ప్రశ్న లేదు.
నీతో సహ ధర్మమును చరించును.
నీవు ఏధర్మమును అనుసరించినా ఈమె కూడా ఆ ధర్మమును అనుసరించును.
ఇంకో ధర్మము కాని మార్గమును కాని అనుసరించదు.
" నీవు పితృవాక్య పరిపాలకుడవి అని ప్రసిద్ధి.
ఈమె కూడా తన తండ్రిమాటను - అంటే "సహధర్మచారీ తవ" అనే మాటను సార్థకము చేయును".

జనకుడు ఇంకా చెపుతాడు
"ప్రతీచ్చ చైనాం" ఈమెను పరిగ్రహింపుము.

నేను నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను - పుచ్చుకో అనలేదు.
ఈమే నీదే.
నీవు అవతార పురుషుడవు.
ఈమె లక్ష్మీదేవి.
అన్ని అవతారాలలో ఈమె నీ సహధర్మచారిణి.
ఈమెను గుర్తింపుము. పరిగ్రహింపుము. అని

అంతే కాదు , జనకుడు ఇంకాచెపుతాడు.

"భద్రం తే".
ఈమెను స్వీకరించడములో నీకు క్షేమము అగును.
నీకు సరి తగిన కన్య.
"ఓ రామా ! ఆమెను గ్రహించి, నాలుగు ఆశ్రమాలలో ఉత్తమమైన గృహస్థ ఆశ్రమము స్వీకరించెదవు.
అమె ద్వారా వంశాభి వృద్ధి కలుగును.
కీర్తి ప్రతిష్టలు సర్వత్ర వ్యాపించును.
నీవు సీతారాముడవు అనబడుదువు.
నీకు క్షేమము అగును".
ఈ కల్యాణముతో నీకు శుభము అగును అని.

ఇలా తన కూతురిని రామునకు అప్పగిస్తూ ఇలా అంటాడు.

"పాణింగృహ్ణీష్వ పాణినా"
నీ చేతిలో ఆమె చేతిని తీసుకొనుము.
అమె చేతిని చేతిలో తీసుకొనుము అనడములో ఆమె రక్షణాభారము ఇక నీదేసుమా అని స్ఫురిస్తుంది.

ఇలా సీత గురించి చెప్పి, సీత చేతిని రామునిచేతిలో తీసుకో మని చెప్పి,
" ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతమ్ జలం తదా" రామచంద్రుని చేతిలో మంత్రపూర్వకమైన జనకుడు ఉదక ధారలను విడిచెను.

సీతారాముల కల్యాణఘట్టములో మనము వినేది ఇదే.
ఇదే ఒక మంత్రము.

ఇదే శ్లోకము మనము చాలాపెళ్ళిళ్ళ సందర్భములో వింటాము.
చాలా శుభలేఖలలో చూస్తాముకూడా
ఇలా శ్లోకములో చెప్పబడినది సీతా రాముల గురించి.
అలా అయితే మనకేమి సంబంధము అనిపించవచ్చు.
ఈ శ్లోకము రాయడములో తాత్పర్యము,
ప్రతి కల్యాణములో వధూవరులు సీతా రాములతో సమానులు.
ఇవ్వ బడుతున్న వధువు ప్రత్యక్షముగా కనిపిస్తున్న కన్యే కాదు.
ఆమెకు కూడా ఉత్తమమైన పుట్టుపూర్వోత్తరాలు వున్నాయి.
ఇకనుంచి ఆమె కూడా వరుని యొక్క సహధర్మచారిణి.
ఆమె పాణిగ్రహణముతో వరునకు క్షేమము అగును.

ఆ శ్లోకము రాయడములో అదే వధువు యొక్క తల్లి దండ్రుల ఆకాంక్ష.

||ఓమ్ తత్ సత్||

||ఓమ్ తత్ సత్||